క్షమాపణలు కోరుతూ గవర్నర్‭కు లేఖ రాస్తా: కౌశిక్ రెడ్డి

క్షమాపణలు కోరుతూ గవర్నర్‭కు లేఖ రాస్తా: కౌశిక్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇన్నాళ్లు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నారు. గవర్నర్‭ను క్షమాపణలు కోరుతూ లిఖితపూర్వకంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి తమిళిసైపై ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళా మోర్చా ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్ స్వీకరించింది. వివరణ ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.