దళంలో చేరడానికి వెళ్తూ పోలీసులకు చిక్కిన్రు..

దళంలో చేరడానికి వెళ్తూ పోలీసులకు చిక్కిన్రు..
  • కుమ్రం భీం జిల్లాలో ఆరుగురు అరెస్ట్​
  • బెజ్జూర్​ మండలం కుష్ణపల్లి సమీపంలో అదుపులోకి..
  • డిటోనేటర్లు, జిలెటిన్​స్టిక్స్​స్వాధీనం 

కాగజ్ నగర్, వెలుగు: మావోయిస్టు పార్టీలో చేరడానికి వెళ్తున్న ఆరుగురిని కౌటాల సర్కిల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వివరాలను ఎస్పీ సురేశ్​కుమార్ కాగజ్‌నగర్‌ టౌన్ పీఎస్​లో తెలియజేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలం కుష్ణపల్లి సమీపంలో ఆదివారం ఉదయం కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ వెంకటేశ్​తో కలిసి తనిఖీలు చేస్తున్నారు. ఆ టైంలో రెండు టూ వీలర్లపై ఆరుగురు వస్తూ కనిపించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద 53 డిటోనేటర్లు, 27 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బెజ్జూరు మండలం మురళీగూడకు చెందిన మడే హనుమంతు ఉన్నాడు. ఇతడు 1987 నుంచి మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 1989లో పీపుల్స్ వార్ తో కలిసి కరువు దాడి చేయగా బెజ్జూర్ పీఎస్​లో కేసు నమోదైంది. గత జనవరిలో మహారాష్ట్రలో మావోయిస్టు పార్టీ అదిలాబాద్ జిల్లా డీసీఎస్ భాస్కర్ అలియాస్​ మైలారపు అడెల్లు, మంగి దళ కమాండర్ వర్గిస్ ను కలిశాడు. వారి సూచన మేరకు సానుభూతిపరులు అందించే పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా హన్మంతు మావోయిస్టులతో సంబంధాలున్న ఏటిగూడకు చెందిన మడే నారాయణ, అతడి తమ్ముడు కౌటాల మండలం జనగాంకు చెందిన ఆలం భగవాన్ కు విషయం చెప్పాడు.  కొన్ని రోజుల కింద భగవాన్ ను  గుండాయిపేట్​కు చెందిన జాడి ఏకనాథ్, నాగపురి చక్రపాణి అలియాస్​చక్రి, జాడి శాంతారాంలు కలిసి మావోయిస్టుల్లో చేరతామని చెప్పారు. దీంతో భగవాన్  వీరిని తన అన్న అయిన మడే నారాయణకు కలిపించి పార్టీలో చేరడానికి ఆసక్తితో ఉన్నారని చెప్పాడు. దీంతో ముగ్గురిని పార్టీలో చేర్పించడానికి  హనుమంతు, నారాయణ, భగవాన్​తీసుకువెళ్తున్నారు. వెంట పేలుడు పదార్థాలు కూడా తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రెస్​మీట్​లో కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్, సీఐలు నాగరాజు, రవీందర్, ఎస్ఐ పాల్గొన్నారు.