రేవంత్‌‌ మర్యాద లేకుండా మాట్లాడుతుండు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

రేవంత్‌‌ మర్యాద లేకుండా మాట్లాడుతుండు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  • వెలమ జాతిని టార్గెట్‌‌ చేస్తున్నడు: కవిత

హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని, వెలమ జాతిని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టు కామెంట్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో ఏ భేద భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేసిన ఆయన.. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఒక జాతిని టార్గెట్ చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని, ఆయన తన తీరును మార్చుకోవాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 

మరోవైపు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. బీఆర్‌‌‌‌ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లో చేరారని, సీఎం రేవంత్ ఆధ్వర్యంలోనే ఆయన ఆ పార్టీలో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ బీఫామ్‌‌లు కూడా ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు స్పందించి ఉంటే అడ్వకేట్‌‌ స్వప్న బతికేది..

అడ్వకేట్‌‌ స్వప్నను సొంత కుటుంబ సభ్యుడే హత్య చేయడం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్న తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఒకవేళ యాక్షన్ తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. దీనిపై డీజీపీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో స్వప్న కుంటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పోలీసులంటే భయం లేకపోవడంతోనే స్వప్న హత్య జరిగిందన్నారు. 

అడ్వకేట్ స్వప్న హత్యపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని, నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షపడేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసురావాలన్నారు. హోం, మున్సిపల్, విద్యా శాఖలు తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. దేన్నీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌‌లో అగ్ని ప్రమాదానికి గురై 22 మంది చనిపోయినా, గురుకులాల్లో విషపు ఆహారం తిని, పాములు కరిచి విద్యార్థులు చనిపోతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.