మిగతా డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర..ఫ్రీ కరెంట్‌‌ ఎత్తేయబోమని చెప్తుంటే అనుమానాలొస్తున్నయ్: టీఆర్ఎస్ చీఫ్ కవిత

మిగతా డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర..ఫ్రీ కరెంట్‌‌ ఎత్తేయబోమని చెప్తుంటే అనుమానాలొస్తున్నయ్: టీఆర్ఎస్ చీఫ్ కవిత
  • రైతు డిస్కంకు పర్మిషన్‌‌ ఇస్తే సుప్రీంకోర్టులో పోరాడుతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కం పేరుతో రేవంత్‌‌ సర్కార్ కొత్త డిస్కంను ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయట్లేదని ప్రెస్​మీట్​ పెట్టి చెప్పే దమ్ము సీఎం రేవంత్‌‌కు ఉందా అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌‌లోని టీఆర్ఎస్‌‌ ఆఫీసులో ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ ఎత్తివేయబోమని చెప్తుంటేనే ఇంకా ఎక్కువ అనుమానించాల్సి వస్తోందన్నారు.

బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలనే పట్టించుకోని సీఎం.. ఇప్పుడు చెప్తున్న మాటలకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం లేదన్నారు. రైతులకు నష్టం చేసే రైతు డిస్కంకు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్​ ఇవ్వొద్దని, ఒకవేళ పర్మిషన్​ ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్లయినా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి తరఫున కేసు వేసినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌‌ సంస్కరణల పేరుతో చేస్తున్న కుట్రలకు రాష్ట్ర సర్కార్​ వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా దేశంలో సోలార్ ప్యానెల్స్ తయారు చేసే చిన్న సంస్థలకు కేంద్రం మరణశాసనం రాస్తోందని మండిపడ్డారు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు ఇండియాలోనే తయారు చేసే కంపెనీలకే అవకాశం అంటూ కొత్తగా జీవో తెచ్చి 5 రోజులు మాత్రమే సమయం ఇచ్చారన్నారు. అట్లయితే రిలయన్స్, అదానీ సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. లక్షలాది మంది చిన్న వ్యాపారులకు నష్టం చేసే ఈ అంశాన్ని కేంద్రం వెంటనే వాపస్‌‌ తీస్కోవాలని కవిత డిమాండ్​ చేశారు.

లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్​ కట్టకపోతే పాదయాత్ర చేస్త

పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలని కవిత కోరారు. ఈ అంశంలో తాము పదే పదే ప్రశ్నించటంతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. అందులో భాగంగా కుమ్మెర అనే గ్రామానికి వెళ్తున్నారన్నారు. అదే గ్రామంలో కులవివక్షతో ఒక పసిగుడ్డును చంపేశారని, సీఎం తప్పకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దసరాలోపు పాలమూరు ప్రాజెక్ట్‌‌లో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ పనులను ప్రారంభించాలన్నారు.

లేదంటే ఆ తర్వాతిరోజు నుంచే పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న స్కూళ్లను బాగు చేయాలంటూ.. హైడ్రా తీరు గురించి కూడా కోర్టు ప్రభుత్వంపై సీరియస్​ అయినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఖమ్మంలో ప్రభుత్వ హాస్పిటల్‌‌లో వైద్యం చేయించడానికి తీసుకొచ్చిన ఓ పసిగుడ్డు చేయి తీసేయడంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సీఎంతోపాటు ఖమ్మం మంత్రులు న్యాయం చేయాలని, ఆ చిన్నారి పేరు మీద రూ.25 లక్షలు డిపాజిట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.