- అందుకే పేరు మార్చి చట్టబద్ధత లేకుండా చేశారు: కవిత
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్టు వ్యవహరిస్తూ వారి నోటి కాడి కూడు లాగేసుకుంటోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పని దినాలు తగ్గించటం, నిధులు ఇవ్వకపోవటంపై మోదీ సర్కార్ను ప్రశ్నిస్తూ మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించడంలో భాగంగానే పేరు మార్చి చట్టబద్ధత లేకుండా చేశారని మండిపడ్డారు. చట్టబద్ధత ఉంటే నిధులు ఇవ్వడం తప్పనిసరి అవుతుందని.. కానీ, ఈ పథకాన్ని ఒక ప్రోగ్రామ్ గా మార్చేసి నిధులు ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత మెరుగుపడిందని కవిత చెప్పారు. అలాంటి ఈ పథకం పని దినాలను తగ్గించటం, నిధులు ఇవ్వకుండా చేయటం ద్వారా గ్రామాల్లో పేదల కడుపు కొడుతున్నారన్నారు. తెలంగాణలో కరోనా తర్వాత 2021–22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే.. గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపాధి హామీలో పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు.
వారికి ఉద్యోగ భద్రతతో పాటు, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద ప్రజల నోటికాడి కూడు లాగేస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమన్నారు. తక్షణమే కేంద్రంలోని వారి ప్రభుత్వంతో కొట్లాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులను తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.
