ఆటో డ్రైవర్ల పొట్ట కొడ్తున్నరు..లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటోలను ప్రభుత్వమే నడిపించే ప్రయత్నం: కవిత

ఆటో డ్రైవర్ల పొట్ట కొడ్తున్నరు..లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటోలను ప్రభుత్వమే నడిపించే ప్రయత్నం: కవిత

హైదరాబాద్, వెలుగు: లాస్ట్ మైల్ కనెక్టవిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్) చీఫ్ కవిత అన్నారు. ఆర్టీసీ బస్సులో ఎక్కిన వాళ్లు తాము దిగాల్సిన స్టేజీకి చేరుకున్నాక ఆటో బుక్ చేసుకుంటే సరిపోతుందని చెబుతూ.. ఆ ఆటోలను కూడా ప్రభుత్వమే నడిపే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఆఫీసులో ఆటోడ్రైవర్లతో ఆమె సమావేశమై, మాట్లాడారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని, ఆటోలకు ఈఎంఐలను కట్టుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.

దీనికి తోడు ఈవీ ఆటోల పేరుతో భారీగా ఆటోలను తెచ్చి ప్రభుత్వమే వాటిని నడిపి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. వన్ స్టేట్, వన్ పర్మిట్ విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చి, మరచిపోయారన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మాట తప్పారన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరిట ఆటోలు నడిపిస్తే.. ఇప్పుడున్న ఆటో డ్రైవర్లతోనే నడిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆటో యూనియన్లతో ప్రభుత్వం చర్చించి వారికి మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోనూ ఈవీ ఆటోలు తెస్తామంటున్నారని, ఇదే జరిగితే వాటిని రోడ్డు మీదకే రానివ్వబోమని ఆమె హెచ్చరించారు