- వచ్చే నెల 2న ఉప్పల్ భగాయత్‌లో అతిపెద్ద భూపోరాటం
హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం మిలి యన్ మార్చ్ లాంటి మరో భూపోరాటాన్ని చేస్తామని తెలం గాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడైనా ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారని భావించినా.. మళ్లీ మోసం చేశారని మండిపడ్డారు. కేకే కమిటీ విధివిధానాలను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోం దని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం జులై 2న ఉప్పల్ భగాయత్ వేదికగా అతి పెద్ద భూపోరాటం చేపడతామని ప్రకటించారు. మంగళవారం టీఆర్ఎస్ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని, ఇది తెలంగాణ అస్తిత్వం, ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు.
ఈ మహా సంగ్రామానికి రాష్ట్రంలోని మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఆస్తులు, ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన వారందరినీ అన్ని విధాలా ఆదుకొని, సముచిత రీతిలో గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి అమరవీరుడి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.రాష్ట్రాన్ని సాధించుకుని 12 ఏండ్లు గడుస్తున్నా.. నేటికీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం అన్యాయమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 6లోపు ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని డిమాండ్ చేశారు.
