- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురవడం కలచివేసిందని మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదని తెలిపారు. గురుకుల విద్యా సంస్థల్లో అపరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, అరకొర వసతుల వంటి కారణాలతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆరోపించారు.
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల ఆవరణలో సంచరిస్తున్న పాములు విద్యార్థులను కాటు వేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. విద్యాశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇకనైనా మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని సూచించారు. పాము కాటుకు గురైన అశ్మితకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
