V6 News

అంబేద్కర్ వల్లే తెలంగాణ సాకారం : కవిత

అంబేద్కర్ వల్లే తెలంగాణ సాకారం : కవిత
  • ఆయన వ్యక్తి కాదు.. ఒక ఐడియాలజీ, థాట్: కవిత
  • రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లవుతున్నా దళితులు, మహిళలపై అకృత్యాలు ఆగలేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి అంబేద్కర్​ వ్యతిరేకి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, జాగృతి ఆఫీసులో నిర్వహించిన అంబేద్కర్​ జయంతి వేడుకలకు ఆమె హాజరయ్యారు.  బాబా సాహెబ్ జయంతి సందర్భంగానైనా ఈ సీఎంకు బుద్ధి వచ్చి పేదలకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదని, ఒక ఐడియాలజీ, ఒక థాట్ అన్నారు. తెలంగాణ ఏర్పడిందంటే అంబేద్కర్ భిక్ష వల్లేనని తెలిపారు. ఆర్టికల్ 3  లేకపోయి ఉంటే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదే కాదన్నారు. రాష్ట్రం సాధించుకుని 12 ఏండ్లు గడుస్తున్నా దళితులు, మహిళలపై ఇంకా అకృత్యాలు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. 

ఏ ప్రాజెక్టుకైనా దళితుల భూములే..

రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులకు చెందిన అసైన్డ్ భూములనే ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో అదే చేశారని, ఇప్పుడు పరిగిలో కూడా 1,200 ఎకరాలు సేకరిస్తే అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములేనని తెలిపారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులను బలి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతలపైలు, సార్లపల్లి చెంచు పెంటల్లో 200కు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు.

చెంచులను అడవికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అజ్మీర్  దర్గాకు కవిత చాదర్​ను పంపించారు. జాగృతి మైనారిటీ నాయకులు అజ్మీర్​కు వెళ్లి చాదర్​ను సమర్పించనున్నారు.