హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్కవిత ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. ‘బాయిబాట’ పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజులపాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలోని బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటించనున్నారు.
16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో ఆమె సమావేశమవుతారు. కాగా, బుధవారం కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆరెత్ విన్ ఓవెన్ సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో హైదరాబాద్ బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘవన్ కూడా పాల్గొన్నారు. ఇండియా, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారు.
