రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు నెరెళ్లలో జరిగిన దాష్టీకం తెలంగాణ సమాజం తల దించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఘటన జరిగి తొమ్మిదేండ్లయినా ఒక్క పోలీసుకు గానీ, పేదల ప్రాణాలు తీసిన పెద్దలకు గానీ ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. నేరెళ్లలో పోలీసుల థర్డ్ డిగ్రీవల్ల అనారోగ్యానికి గురై ఇటీవల చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు.
ఈ ఘటన జరిగినప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని, క్షమాపణ అడుగుతున్నానని తెలిపారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక లారీల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోగా నిరనస చేపట్టిన ఎనిమిది మందిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని, ఈ ఘటనను వాడుకొని రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఓట్లు దండుకుని బాధితులను వదిలేశారని ఆరోపించారు.
జాతీయ ఎస్సీ కమిషన్‌ను తీసుకొచ్చిన బండి సంజయ్ ఆ రిపోర్ట్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలైనా పట్టించుకోవడంలేదని కవిత విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు ఎందుకు న్యాయం చేయటం లేదని కవిత ప్రశ్నించారు.
తాను టూరిస్టుల మాదిరిగా కాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్తామన్నారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన బాధితులను కవిత పరామర్శించారు. బాధితుడు బానయ్య నివాసంలో హరీశ్ సహా ఇతర బాధితులతో మాట్లాడారు.
