అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తేస్తాం : టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత 

అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తేస్తాం : టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత 

చేవెళ్ల, వెలుగు: తాము అధికారంలోకి రాగానే 111 జీవోను ఎత్తేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. శనివారం మొయినాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొయినాబాద్ ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరిగినా జీవో నం.111 కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ జీవో ఎత్తివేస్తామని అన్ని పార్టీల నాయకులు చెబుతున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదని విమర్శించారు. 120 గ్రామాలకు శాపంగా మారిన జీవోను ఎత్తివేయాల్సిందేనని, ఇందుకోసం చేవెళ్ల, మొయినాబాద్ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పోతాయనుకుంటే అది జరగలేదని వాపోయారు. తాము అధికారంలో వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల అభ్యున్నతి, ఆడబిడ్డల భవిష్యత్ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అంతకుముందు చిలుకూరు బాలాజీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సురంగల్ గ్రామంలో తన సొంత ఖర్చుతో టీఆర్ఎస్ నాయకుడు గాండ్ల సంతోష్ కుమార్ నిర్మించనున్న బస్ షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు.