హైదరాబాద్, వెలుగు: నీట్ లీకేజీపై 36 రోజుల పాటు విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సరికాదని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రమంత్రి రాజీనామా చేయడంతో పాటు విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వారి ఉద్యమ విజయమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాలను యువత ప్రశ్నిస్తారనే భయంతోనే సీఎం నగరంలో ఊరేగింపులు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత పార్లమెంట్‌కు వెళ్లేలా బిల్లు తీసుకొస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయమేనని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బిల్లులు కేంద్రంలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ బిల్లు విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కవిత ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేదంటే యువతే మిమ్మల్ని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.
