- రెండున్నరేండ్లుగా వ్యవసాయశాఖపై సీఎం రేవంత్ రివ్యూ చేయలే: కవిత
- సెక్రటేరియెట్ వద్ద టీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా అరెస్ట్, విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా వరి కుప్పలపైనే రైతులు చనిపోతున్నారని, ఆ ఘటనలు చూస్తుంటే బాధనిపిస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో అన్యాయం చేయవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు సెక్రటేరియెట్ వద్ద ధర్నాకు దిగారు.
పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఫలక్నుమా స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా సరే సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. రెండున్నరేండ్లుగా వ్యవసాయ శాఖపై కనీసం రివ్యూ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి కుప్పలపై చనిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రైతుల బాధ మామూలుగా లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. మండుటెండలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. అత్యంత అమానవీయ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని చేతగాని దద్దమ్మ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా కొనుగోళ్లు చేపట్టాలని, లేదంటే రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
