పోలింగ్పై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్​ పోస్టుమార్టం..

పోలింగ్పై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్​  పోస్టుమార్టం..

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​పై బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ శుక్రవారం పోస్ట్​మార్టం నిర్వహించారు. ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఎలక్షన్​ ఇన్​చార్జీలతో రివ్యూ చేశారు. పోలింగ్​బూత్ ల వారీగా ఎన్ని ఓట్లు పోల్​అయ్యాయి.. అందులో వివిధ పథకాల లబ్ధిదారులు ఎంత మంది ఓటేశారు. లబ్ధిదారుల ఓట్లలో ఎన్ని ఓట్లు బీఆర్ఎస్​కు పోల్​కావచ్చు, ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతరుల ఓట్లు ఎంతమేరకు వస్తాయి అనే సమాచారం సేకరించారు. వివిధ సర్వే ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్​ రిపోర్టులతో ఆయా నివేదికలను సరి పోల్చి బీఆర్ఎస్​ఎన్ని సీట్లలో విజయం సాధించే అవకాశముందో అంచనాకు వచ్చారు. అనంతరం మంత్రులు నిరంజన్​రెడ్డి, జగదీశ్​రెడ్డి, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, మహబూబ్​నగర్, ఆదిలాబాద్​జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్​ స్పందిస్తూ.. మళ్లీ మనమే రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని చెప్పినట్టుగా తెలిసింది. ‘‘ఎందుకు ఆగమాగం పరేషాన్​అయితుండ్రు.. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి, మూడో తేదీన అందరం కలిసి సంబరాలు చేసుకుందాం..” అని కేసీఆర్​ వారితో చెప్పినట్టుగా తెలిసింది.

4న రాష్ట్ర కేబినేట్ భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానున్నట్లు సీఎం పీఆర్వో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.