కేసీఆర్ ఫ్యామిలీ మూసీ నీళ్లు తాగాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామిలీ మూసీ నీళ్లు తాగాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     అప్పుడే ఆ నీళ్లు ఎంత ప్రమాదకరమో తెలుస్తది
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలెంజ్
  •     కవిత కన్ఫ్యూజన్​లో ఉండి జనాల్ని తికమక పెడుతున్నదని విమర్శ
  •     వచ్చే 20 ఏండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వమే ఉంటుందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ ను ఉరితీయాలని విమర్శిస్తే... తన రక్తం మరిగిపోతున్నదని ఆయన బిడ్డ కవిత తీవ్రంగా స్పందించిందని, మరి రక్తం పంచుకు పుట్టిన సోదరుడిని, మేనబావను అదే స్థాయిలో విమర్శిస్తే ఎందుకు స్పందించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సభకు వస్తేనే బీఆర్ఎస్  పుంజుకుంటుందని అంటున్న కవిత.. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉందా? లేదా అనేది స్పష్టం చేయాలన్నారు. ఆమె కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజన్  చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్  నోరు యమునా నది కన్నా ఎక్కువ కంపు అని దుయ్యబట్టారు. మూసీ నీళ్లు ఎంత ప్రమాదకరమో తెలియాలంటే కేసీఆర్  కుటుంబం ఆ నీళ్లు తాగాలన్నారు. మూసీ ప్రభావం దక్షిణ తెలంగాణపై పడడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్  భారీ విజయం  సాధించిందన్నారు. 

ఒక్క సూర్యాపేటలో మాత్రం కాంగ్రెస్  అభ్యర్థి దామోదర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ప్రచారం చేయలేకపోయారని, దీంతో అక్కడ జగదీశ్​ రెడ్డి గెలిచారని చెప్పారు. రాష్ట్రంలో దొరల పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను బలంగా కోరుకున్నానని, అంతేతప్ప తనకు మంత్రిపదవి కావాలని కాదని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిపదవి కోసం తాను ఎవరినీ అడగలేదన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వమే ఉంటుందన్నారు.