ఈ ఏఢాది భారత్ కు స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ లో కీలక విజయాలు దక్కాయి. ఒలింపిక్స్ లో మన వాళ్లు మంచి ఫాం ప్రదర్శించి ఏడు పతకాలు సాధించారు. అటు మిస్ యూనివర్స్ కిరీటం మన దేశానికే చెందిన హర్నాజ్ సంధుకు దక్కింది. ట్విట్టర్ సీఈవోగా భారత్ కు చెందిన పరాగ్ ఎంపికయ్యారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. ఈ ఏడాది జరిగిన పొలిటికల్ ఈవెంట్స్ లో అతిపెద్దది కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ. ప్రధాని మోడీ టీంలో కొత్తగా శర్వానంద సోనోవాల్, నారాయణ్ రాణె, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారిని కేబినెట్ లో చేర్చుకున్నారు. హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ సహా 12 మందిని మంత్రివర్గం నుంచి తొలగించారు. అటు ఈ ఏడాది పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు సీఎంలు మారారు. కొత్తవారు వచ్చారు. అటు ఈ ఏడాది జూన్ లో జమ్మూకాశ్మీర్ కు చెందిన రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. దీన్ని మరోసారి రాష్ట్రంగా మార్చాలన్న విషయంపై చర్చలు జరిగాయి. మరోవైపు ప్రధాని మోడీ సెప్టెంబర్ లో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కు హాజరై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు.
ఒలింపిక్స్ లో భారత్ ప్లేయర్స్ మంచి ప్రతిభ కనబరిచారు. టోక్యో ఒలింపిక్స్ కు మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 120 మంది అథ్లెట్లు అర్హత సాధించి వెళ్లడం మొదటి విజయం. మొత్తంగా 7 పతకాలు సాధించారు. అందులో ఒకటి గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. కుస్తీ పోటీల్లో తృటిలో గోల్డ్ చేజార్చుకున్నా రవికుమార్ సిల్వర్ మెడల్ పట్టుకొచ్చాడు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను వెండి పతకం సాధించింది. బాక్సింగ్ లో లవ్లీనా, బ్యాడ్మింటన్ లో పీవీ సింధు కాంస్య పతకాలు సాధించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో భారత్ తరపున రెండు పతకాలు సాధించిన ప్లేయర్ గా పీవీ సింధు మరో రికార్డు సృష్టించింది. ఇక మెన్స్ హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. అటు పారా ఒలింపిక్స్ లోనూ మన వాళ్లు సత్తా చాటారు. ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల పేరును కేంద్రం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది.
విశ్వ సుందరి కిరీటం ఈ ఏడాది భారత్ కే దక్కింది. పంజాబ్ కు చెందిన హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ విశ్వసుందరి క్రౌన్ భారత్ కు వచ్చింది. అందం, తెలివితో అందరి ప్రశంసలు అందుకున్న హర్నాజ్ విశ్వసుందరిగా ఎంపికైంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 79 మంది పార్టిసిపెంట్స్ ను వెనక్కు నెట్టి హర్నాజ్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఫైనల్ రౌండ్ లో సౌతాఫ్రికా, పరాగ్వే కు చెందిన ఇద్దరిని ఓడించి చివరకు కిరీటం దక్కించుకున్నారు. అందానికి అందం, మాటల్లో ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి 21 ఏళ్ల హర్నాజ్ ను టాప్ లో నిలిపాయి. అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం. తెలివిగా ఉండడం ఇవన్నీ విశ్వ కిరీటం సాధించడానికి సంధుకు కీలకమయ్యాయి.
ఈ ఏడాది పరాగ్ అగర్వాల్ టాలెంట్, క్రియేటివిటీతో తక్కువ టైంలోనే ట్విట్టర్ సీఈవో పొజిషన్ కు చేరుకున్నారు. బోర్డు ఏకగ్రీవంగా పరాగ్ ను ఎంపిక చేసిందంటే అతడి ప్రతిభా సామర్థ్యాలు అర్థం చేసుకోవచ్చు. ట్విట్టర్ లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నప్పుడు 2011లో చేరిన పరాగ్... దశాబ్దం తిరక్కుండానే కంపెనీ సీఈవో అయ్యారు. పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్‌లోనే పరాగ్ విద్యాభ్యాసం కొనసాగింది.
యాహూ 2021కి గానూ ఇయర్ రివ్యూ రిలీజ్ చేసింది. భారత్ లో ఇంటర్నెట్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కేటగిరిలో ప్రధాని మోడీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. బెంగాల్ సీఎం మమత థర్డ్ పొజిషన్ లో ఉన్నట్లు యాహూ లిస్ట్ రిలీజ్ చేసింది. సిద్ధార్థ్ శుక్లా, రాహుల్ గాంధీ వరుసగా నాలుగు ఐదు పొజిషన్స్ లో ఉన్నారు. టాప్ న్యూస్ మేకర్స్ లిస్టులో రైతుల పోరాటం మొదటి స్థానంలో నిలవగా, షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించి సెర్చ్ చేయడంతో రెండో స్థానంలో నిలిచాడు. కేంద్ర బడ్జెట్, రాజ్ కుంద్రా, బ్లాక్ ఫంగస్ ఇష్యూలు టాప్ న్యూస్ మేకర్స్ లిస్టులో మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నట్లు యాహూ తెలిపింది.

