హైదరాబాద్: 52 రోజుల పాటు సమ్మె తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులతో ఆదివారం ప్రగతి భవన్‌లో భేటీ అయిన సీఎం కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు. ఇక పాత ఆర్టీసీతో పని లేదని, బాగుపడే ఆర్టీసీ ఉండాలని, పని చేసే సంస్థ కావాలని సీఎం అన్నారు. ఏడాది తిరిగే లోపు రూ.1000 కోట్ల ఆదాయంతో సంస్థ నడిచే పరిస్థితి రావాలన్నారాయన. సమ్మె వల్ల పెండింగ్‌లో పడిన సెప్టెంబరు నెల జీతాన్ని రేపే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె కాలం నాటి జీతం కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఆయన ప్రసంగం సందర్భంగా పలుమార్లు కార్మికులు చప్పట్లు కొడుతూ.. కేసీఆర్ జిందాబాద్ అంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
MORE NEWS:
వెటర్నరీ డాక్టర్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన
ఆర్టీసీలో రెండేళ్లు నో యూనియన్స్.. ముందు పని చేయాలే
ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు
ఆర్టీసీ ఉద్యోగులతో భేటీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలివి :
- ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
- ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
- ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం
- ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం
- సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
- ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
- ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.
- సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
- కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
- మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి
- ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
- మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
- మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
- మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
- రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు
- ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం
- ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి
- ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు
- ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి
- ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
- ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం
- డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం
- ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం
- ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
- ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.

