ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్

ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేశుడి తయారీ పనులు స్టార్ట్ అయ్యాయి.  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 6) కర్ర పూజ నిర్వహించి 71వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులకు అంకురార్పణ చేశారు. ఈ మేరకు గణనాథుడి రూపాన్ని  ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. ఈ ఏడాది (2025) 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణేషుడు.

 ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండనున్నారు. కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల్ రామచంద్రారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సారి 71 వేడుకలు నిర్వహిస్తున్నామని.. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో  ఖైరతాబాద్ గణనాధుడు పేరు ప్రతిష్టలు వచ్చాయని తెలిపారు. 

గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసిందని.. మీడియా పాత్ర ఎప్పటికి మరచిపోలేమన్నారు. ప్రతి ఒక్కరు ఈ సారి జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సపోర్ట్‎గా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ గణేష్‎ను దర్శించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.