ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్లు

ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్లు
  • టెర్రరిస్ట్ ను రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ డబ్బులు అడిగిండు: పన్నూ 
  •     న్యూయార్క్​లోని గురుద్వారాలో డీల్ కుదుర్చుకున్నడు 
  •     2014 నుంచి 2022 మధ్య రూ.133 కోట్లు ఇచ్చాం
  •     1993 ఢిల్లీ బ్లాస్ట్ దోషి అయిన భుల్లార్ ను ఇంకా విడుదల  చేయలేదంటూ వీడియోలో వెల్లడించిన పన్నూ 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​పై ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సంచలన ఆరోపణలు చేశాడు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూప్స్ మొత్తం రూ.133.54 కోట్లు ముట్టజెప్పాయని వెల్లడించాడు. 2014లో అర్వింద్ కేజ్రీవాల్ తమతో ఓ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించాడు. 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్​లో దోషి అయిన దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్​ను రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చినట్టు గురుపత్వంత్ సింగ్ చెప్పాడు. అలా చేయాలంటే.. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు వివరించాడు. ఈ మేరకు గురుపత్వంత్ సింగ్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఖలిస్తానీ గ్రూప్​తో కేజ్రీవాల్​కు ఉన్న సంబంధాన్ని ఆయన వివరించాడు. 1993, ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తొమ్మిది మంది చనిపోగా.. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు పేలుడు కేసులో ఖలిస్తానీ టెర్రరిస్ట్ దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత శిక్షను జీవిత ఖైదుగా మార్చగా.. 20 ఏండ్లుగా అతడు జైల్లో ఉన్నాడు. కాగా, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ  గ్రూప్ కు చెందిన టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. 

ఆప్​కు పెద్ద ఎత్తున నిధులు

అమెరికా, కెనడా పౌరసత్వం కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తానీ టెర్రరిస్ట్. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఇండియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. ‘‘2014లో న్యూయార్క్​లోని రిచ్​మండ్​హిల్​లో ఉన్న గురుద్వారాలో ఖలిస్తానీ అనుకూల సిక్కు లీడర్లు.. కేజ్రీవాల్​తో భేటీ అయ్యారు. భుల్లార్​ను రిలీజ్ చేస్తామని కేజ్రీవాల్ వారికి హామీ ఇచ్చాడు. దీనికి బదులుగాడబ్బులు ఇవ్వాలని కోరాడు. 2014 నుంచి 2022 దాకా రూ.133 కోట్ల వరకు ఇచ్చాం’’ అని గురుపత్వంత్ సింగ్ పన్నూ వీడియోలో చెప్పాడు. కాగా, కేజ్రీవాల్‌‌‌‌పై పన్నూ ఇలా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఖలిస్తాన్ గ్రూప్‌‌‌‌ల నుంచి ఆప్‌‌‌‌కు పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని గతంలోనూ చెప్పాడు. ఈ ఏడాది జనవరిలోనే కేజ్రీవాల్‌‌‌‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌‌‌‌పై కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు. కెనడా, అమెరికాకు చెందిన ఖలిస్తాన్ గ్రూప్‌‌‌‌ల నుంచి పెద్దఎత్తున నిధులు అందినట్టు చెప్పాడు. ఫిబ్రవరిలోగా సిఖ్ ఫర్ జస్టిస్ లీడర్లు జగదీశ్ సింగ్, మన్జీత్ సింగ్, దేవిందర్ సింగ్​ను రిలీజ్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. వీరంతా రాజ్​పురాకు చెందినవారు కాగా.. పంజాబ్ కు చెందిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ అరెస్ట్ చేసింది.