రిటైర్మెంట్ ప్లాన్ మారుతోంది: మెట్రో నగరాలకు గుడ్-బై.. చిన్న పట్టణాలకు వెల్‌కమ్!

రిటైర్మెంట్ ప్లాన్ మారుతోంది: మెట్రో నగరాలకు గుడ్-బై.. చిన్న పట్టణాలకు వెల్‌కమ్!

ఒకప్పుడు ఉద్యోగం, సంపాదన కోసం అందరూ ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాలకు పరుగులు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా గడపడం కోసం చాలామంది ఈ రద్దీ నగరాలను విడిచి చిన్న పట్టణాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

ఎందుకంటే మెట్రో నగరాల్లో జీవితం ఇప్పుడు విలాసం కంటే భారంగా మారుతోంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే విపరీతమైన ఖర్చులు పెరగడం అంటే  ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌ తలనొప్పితో చిక్కుకుపోవాల్సి వస్తోంది. అలాగే పెరిగిన గాలి కాలుష్యం వల్ల ఆరోగ్యం పాడవుతోంది. రిటైర్ అయిన వారికి ఈ ఒత్తిడి కంటే మనశ్శాంతి ముఖ్యం. అందుకే వారు చిన్న నగరాల వైపు చూస్తున్నారు.

హాట్ ఫేవరెట్‌గా మారుతున్న చిన్న నగరాలు
డెహ్రాడూన్, మైసూరు, ఇండోర్, చండీగఢ్, భువనేశ్వర్ వంటి నగరాలు ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ గడపడానికి బెస్ట్ ఆప్షన్లుగా మారుతున్నాయి. మెట్రో నగరాల్లో ఒక ఫ్లాట్ కొనాలంటే కోట్లకు పైగా ఖర్చవుతుంది. అదే ఈ చిన్న నగరాల్లో అయితే  రూ. 30 లక్షల నుండి రూ. 1.5 కోట్ల మధ్యలో తక్కువ ధరకే అన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు చిన్న నగరాల్లో కూడా మంచి రోడ్లు, విమానాశ్రయాలు, హాస్పిటల్స్ మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే ప్రజలు ధైర్యంగా అక్కడికి వెళ్తున్నారు.

చిన్న నగరాల వల్ల కలిగే లాభాలు:
 తక్కువ కాలుష్యం, స్వచ్ఛమైన గాలి వల్ల వృద్ధులకు శ్వాసకోశ సమస్యలు రావు. ప్రశాంతమైన పార్కులు, నడకకు అనువైన వాతావరణం ఉంటాయి. పెన్షన్ లేదా పొదుపు చేసుకున్న డబ్బుతో ఇక్కడ రాజాలా బతకవచ్చు. ఇంకా ప్రతినెలా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. చిన్న నగరాల్లో చుట్టుపక్కల వారితో స్నేహాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయి. ఇది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది.

 కొన్ని చిన్న పట్టణాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లేకపోవచ్చు. కానీ, ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల అవసరమైతే వెంటనే పెద్ద నగరాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ కాలంలో 'లగ్జరీ' అంటే ఖరీదైన కార్లు, బంగ్లాలు మాత్రమే కాదు.. ప్రశాంతమైన గాలి, మనశ్శాంతి అని రిటైర్డ్ వ్యక్తులు భావిస్తున్నారు. అందుకే రిటైర్మెంట్ లైఫ్‌కి చిన్న నగరాలే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.