ఏపీలోని గుంటూరులో దారుణం
అమరావతి, వెలుగు: సొంత కొడుకునే కిడ్నాప్ చేసి.. అన్నను డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన శాగంలపూడి శివ, శాగలంపూడి గాంధీ అన్నదమ్ములు. గాంధీకి ఐదు నెలల కొడుకు ఉన్నాడు. సొంత కొడుకును కిడ్నాప్ చేసి అన్న దగ్గర డబ్బులు వసూలు చేయాలని గాంధీ ఆలోచించాడు. ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి సంతోష్ ను కిడ్నాప్ చేశాడు. చిన్నారి అదృశ్యంపై పెదనాన్న శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు.. చిన్నారి కావాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కిడ్నాపర్లు ఫోన్ చేసిన విషయాన్ని శివ పోలీసులకు చెప్పారు. వెంటనే అలర్ట్ అయిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయారావు నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. సైబర్ టీమ్ ద్వారా కిడ్నాపర్ల ఫోన్ నంబర్ ను ట్రాక్ చేశారు. నిందితులు కారంపూడి మండలం ఒప్పిచర్ల వద్ద ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో సంతోష్ తండ్రి గాంధీ కూడా ఉన్నాడు. పోలీసులు విచారించగా డబ్బు కోసమే ఫ్రెండ్స్ తో కలిసి కొడుకును కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు.
