
హైదరాబాద్, వెలుగు: పెయిన్ రిలీఫ్కు సరికొత్త ఎక్స్ఆర్ (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) టెక్నాలజీని గచ్చిబౌలిలోని కిమ్స్ హాస్పిటల్ శనివారం ఆవిష్కరించింది. పెయిన్ స్కేప్ 2025 సదస్సులో భాగంగా కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ఈ టెక్నాలజీని ప్రారంభించారు. ఇది సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, డయాలసిస్, ప్రసవంలాంటి వివిధ రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో రోగులకు సహాయపడుతుంది.
ఈ ఎక్స్ ఆర్ హెడ్ సెట్‌లు రోగుల దృష్టిని మరల్చి, నొప్పిని మరచిపోయేలా చేస్తాయి. పిల్లలకు ఇంజెక్షన్లు వేసేటప్పుడు నొప్పి తెలియకుండా, డయాలసిస్ రోగులకు ఇష్టమైన పనులు చేస్తున్న అనుభూతిని కలిగించడం ద్వారా నొప్పిని దూరం చేస్తుంది. మెదడు.. నొప్పిని గ్రహించకుండా చేయడం ఈ టెక్నాలజీలోని ప్రత్యేకత అని డాక్టర్ అంకిత ఆర్. చావ్లా, డాక్టర్ రణధీర్ అన్నారం తెలిపారు. ఈ సదస్సులో డాక్టర్ మణిమాల రావు, కిశోర్‌రెడ్డి, డాక్టర్ బీరప్ప, డాక్టర్ ప్రదీప్ జైన్, డాక్టర్ మురళీధర్ జోషి వంటి ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.