- పులి ఆవాసానికి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ
- మహారాష్ట్ర నుంచి కూనతో పాటు వచ్చి వెళ్లిన పులి
- వన్యప్రాణుల దాహం తీర్చడంపై అటవీ శాఖ నజర్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో జీవ వైవిధ్యానికి అటవీశాఖ పెద్ద పీట వేస్తోంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి బిడ్డతో సహా పులి వచ్చి అభయారణ్యంలో వారం రోజుల పాటు ఉంది. పులితో పాటు వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు అభయారణ్యంలో ఉండడంతో వాటి సంరక్షణకు అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. అభయారణ్యంలోని 200 హెక్టార్లలో గడ్డి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గడ్డితో పాటు 34 సోలార్ బోర్లతో నీటి సౌలత్ కల్పిస్తోంది.
పెద్దపులి ఆవాసానికి అనుకూలం..
జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యం పెద్దపులికి ఆవాసంగా మారనుంది. 635.04 చదరపుకిలోమీటర్ల మేర అభయారణ్యం విస్తరించి ఉంది. దశాబ్దాల కింద పులితో పాటు చిరుతలు ఈ ప్రాంతంలో సంచరించాయి. గ్రామాల్లోకి పులులు వచ్చేవని ఏజెన్సీవాసులు చెబుతుంటారు. పోడు భూములు, అడవుల నరికివేత, స్మగ్లింగ్‌తో అటవీ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలతో కొత్తగా పోడు కొట్టడం లేదు.
అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మారు జాతి మొక్కల పెంపకంతో కొంత వరకు అడవులు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఈక్రమంలోనే మార్చిలో మహారాష్ట్ర నుంచి కిన్నెరసాని అభయారణ్యంలోకి బిడ్డతో పాటు ఓ పెద్దపులి వచ్చి వారం రోజుల పాటు సంచరించింది. అభయారణ్యంలో పులి ఆవాసానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు గుర్తించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు..
కిన్నెరసాని అభయారణ్యంలో చుక్కల దుప్పులు, సాంబార్లు, కనుజులు, ఎలుగుబంట్లు, అడవి గేదెలు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అడవి కోళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. అరుదైన15 రకాల పక్షులున్నాయి. సైబీరియన్ పక్షులు అభయారణ్యంలోకి రాకపోకలు సాగిస్తుంటాయి. వన్యప్రాణులను గుర్తించేందుకు 58 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
200హెక్టార్లలో గడ్డి పెంపకం..
కిన్నెరసాని అభయారణ్యంలో 200 హెక్టార్లలో గడ్డి పెంచేందుకు అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. 10 హెక్టార్ల చొప్పున 20 ప్రాంతాల్లో గడ్డి పెంపకానికి అటవీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. గడ్డి పెంపకం కోసం 26 ప్రాంతాల్లో సోలార్ బోర్లను ఏర్పాటు చేశారు. మరో 8 చోట్ల బోర్లను ఏర్పాటు చేయనున్నారు. 50 చోట్ల చెక్ డ్యాంలు, 117 సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారు. పర్కులేషన్ ట్యాంకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సమ్మర్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా రేంజ్‌ల వారీగా నీటిని సప్లై చేస్తున్నారు.
సమ్మర్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బీపీఎల్ వంటి సంస్థలు సీఎస్ఆర్ నుంచి కొంత మొత్తాన్ని కేటాయించాలని కోరుతున్నారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకున్నామని డీఎఫ్ వోకిష్టాగౌడ్, పాల్వంచ అభయారణ్యం ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఎం.బాబు తెలిపారు. పర్కులేషన్ ట్యాంక్స్, నీటి గుంతలు, చెక్‌డ్యాంలు, సోలార్ బోర్ వెల్స్, వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నామని చెప్పారు.
