V6 News

రేవంత్, కేటీఆర్ మాటలు ‘ఒవైసీ ఫార్ములా’ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రేవంత్, కేటీఆర్ మాటలు ‘ఒవైసీ ఫార్ములా’ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     మహిళా బిల్లును అడ్డుకుంటే చరిత్రహీనులవుతరు..
  •     మోదీ ఫార్ములాతో దక్షిణాదికి అన్యాయం జరగదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  
  •     సీట్ల పెంపుపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని ఫైర్​

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీ కనుసన్నల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మాట్లాడుతున్నది వారి మాటలు కావు.. అవి అసదుద్దీన్ ఒవైసీ నేర్పిన హైబ్రిడ్ ఫార్ములా’’ అని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్​రెడ్డి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోనేటోళ్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ఫార్ములా వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.  

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్​ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఏ లెక్కన 850 సీట్లు పెంచుతారని ప్రశ్నిస్తోన్న నేతలు... ఏపీ విభజన బిల్లులో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153 స్థానాలకు, ఏపీ లో 175 నుంచి 225కు పెంచాలని ఏ ఫార్ములా అనుసరించారో? కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.  

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 70 శాతం రెవెన్యూ వస్తోంది. మిగిలిన జిల్లాలకు కోతపెట్టి.. హైదరాబాద్, రంగారెడ్డిల్లోనే సీట్లు పెంచాలని రేవంత్, అసదుద్దీన్, కేటీఆర్ కోరుతున్నారా? మిగిలిన జిల్లాల్లో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? ఈ ముగ్గురూ సమాధానం చెప్పాలి’అని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. దక్షిణాదికి చెందిన రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు మోదీకి ధన్యవాదాలు చెప్పాలన్నారు. కొత్త ఫార్ములాను స్వాగతించాలని, వాళ్ల పార్టీ ఆఫీసుల్లో మోదీగారి ఫొటో పెట్టుకోవాలని హితవుపలికారు.