యాదాద్రి, వెలుగు: ఈ ఏడాదిలో ఎయిమ్స్‌ను పూర్తి చేస్తామని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్ పూర్తయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎయిమ్స్ సమీపంలో రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ స్టాప్ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను ఆయన సందర్శించి వివిధ విభాగాలను, పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 202 ఎకరాల విస్తీర్ణంలో, 750 పడకల సామర్థ్యంతో, రూ.1,110 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ మాత్రమే బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఎయిమ్స్‌లో వెయ్యి మందికి పైగా సిబ్బంది నియామకాలు జరిగాయని, ఈ ఏడాది జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ట్రీట్మెంట్ కోసం వచ్చేవారితో పాటు వారి వెంట వచ్చే సహాయకుల కోసం అమృత్ నివాసం పేరుతో ప్రత్యేక నివాస వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్‌లో ప్రతి రోజు 1,800 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు.
ఎయిమ్స్ పనులు 86 శాతం పూర్తయ్యాయని, రూ. 831 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆయుష్మాన్ భవ, ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని, మిగిలిన వారికి నామమాత్రపు ఫీజులు ఉంటాయని చెప్పారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, వేముల అశోక్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ ఉన్నారు.
