హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఇష్టమొచ్చినట్టు డిక్లరేషన్లు ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక వాటిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమే అని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చిందని అన్నారు. వంద రోజుల్లో అన్ని అమలు చేస్తామని ప్రకటించి.. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పార్టీ స్టేట్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌తో పాటు ఉప్పల్, జూబ్లిహిల్స్ సెగ్మెంట్ల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కిషన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ మళ్లీ ప్రధాని కావాలి.
అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ లీడర్లు.. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ పరోక్షంగా అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కారు.. ఇచ్చిన గ్యారంటీలు కూడా అమలు కావు..’’అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రాంచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాశ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.