రోజ్‌గార్ మేళాలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత
మెట్రో విస్తరణకు లోన్ ఇప్పించండి:
మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: దేశాభివృద్ధిలో యువతే కీలకమని, వారు ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతకు రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ కళాభవన్‌లో జరిగిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను అందించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా మార్చడంలో యువశక్తి పాత్ర కీలకమన్నారు. ఉపాధి కల్పన కోసం కేంద్రం ప్రత్యేకంగా పీఎం వీబీఆర్ వై స్కీం తీసుకొచ్చిందని, దీనికోసం రూ.99,446 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొత్త కొలువులు ఇచ్చే యజమానులకు, పరిశ్రమలకు కూడా కేంద్రం అండగా ఉంటోందన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు నాలుగేళ్లపాటు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో 2.2 లక్షల స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉండటం గర్వకారణమని, వీటి ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. తెలంగాణలో 9,922 స్టార్టప్‌లు ఉంటే, అందులో సగం కంటే ఎక్కువ (5,042) స్టార్టప్‌లను మహిళలే నడిపిస్తున్నారని అభినందించారు. కార్మిక సంక్షేమం కోసం 20 పాత చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. లోన్ వస్తే మెట్రో మరింత విస్తరణ:
వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఐఆర్ఎఫ్ సీ ద్వారా లోన్ ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. లోన్ వస్తే మెట్రో మరింత విస్తరించి నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రపంచ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఆయిల్ ధరలు పెరిగి, జీవన వ్యయం పెరగడంతో గ్రోత్ రేట్ తగ్గుతోందని, దీంతో ఉపాధి కల్పనపై ప్రభావం పడుతోందన్నారు. దేశంలో 7 నుంచి 8 శాతం గ్రోత్ ఉంటేనే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని వివేక్ అభిప్రాయపడ్డారు. ఇదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 65 ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో శిక్షణ ఇచ్చి టామ్ కామ్ ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీ హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
