- మహిళా బిల్లును కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు ఏడు సార్లు అడ్డుకున్నయ్: కిషన్రెడ్డి
- అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం చూసేందుకే బిల్లును నెగ్గనీయలే
- త్వరలోనే ఇంటింటికీ వెళ్లి మహిళలను కలుస్తమని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకొని కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు, బిల్లును వ్యతిరేకించిన పార్టీలు చరిత్రలో మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయన్నారు. అసలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు ఇండియా కుటమి నేతలకు చెప్పలేకపోయారన్నారు.
వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్‌లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ప్రధాని మోదీ మంచి ఫార్ములాను తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందన్నారు.
ఏడు సార్లు అడ్డుకున్నరు..
మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదని, రెండు నాల్కల ధోరణితో మొత్తంగా 7 సార్లు కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయన్నాయని ఆరోపించారు. తొలిసారి 1996లో దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆ తర్వాత 98, 99, 2002లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అడ్డుకున్నారని చెప్పారు. బిల్లు పేపర్లను చించి స్పీకర్ మీద, ప్రధానిపై వేశారని, 2008–10 లో మన్మోహన్ ప్రభుత్వం బిల్లు పెడితే.. సమాజ్ వాద్ పార్టీ, ఆర్జేడీ పార్టీలను ప్రోత్సహించి బిల్లును అడ్డుకునేలా చేశారన్నారు. నాడు.. కాంగ్రెస్ మిత్రపక్షాలు.. మేం గిల్లినట్టు చేస్తం, మీరు ఏడ్చినట్టు చేయండన్నట్టుగా కాంగ్రెస్ తో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించాయని, శుక్రవారం కూడా అదే తరహాలో అన్నీ పార్టీలు కలిసి మహిళాబిల్లును అడ్డుకున్నాయని విమర్శించారు.
అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం చూసేందుకే..
కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు తెలంగాణలో ఉన్నారని, అసదుద్దీన్ ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకే మహిళా బిల్లును నెగ్గనీయలేని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మహిళల ఆకాంక్షలను అసదుద్దీన్ ఒవైసీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. మహిళ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం అన్నారు.
దేశంలోని 70 కోట్ల మంది మహిళల రాజకీయ అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని, ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. 131వ రాజ్యాంగ సవరణకు అడ్డుకోవడం ద్వారా మహిళలకే కాకుండా దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన ద్వారా డీలిమిటేషన్ జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు మహిళను సీఎంను చేశారా?
బీజేపీకి మహిళా అధ్యక్షుడిని చేశారా? అన్న సీఎం ప్రశ్నకు స్పందిస్తూ.. ‘రేవంత్ రెడ్డి ప్రశ్నలకు తలా తోకా లేదు. 1948 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలో ఒక మహిళను, బీసీని సీఎం చేశారా?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు జరిగిన అన్యాయంపై.. దేశంలోని 70 కోట్ల మంది మహిళలను ఇంటింటికీ వెళ్లి కలుస్తామన్నారు. మహిళలు ఎదురు తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందో.. కాంగ్రెస్ పార్టీ నేతలు త్వరలోనే చూస్తారని కిషన్రెడ్డి హెచ్చరించారు.

