డబ్బులు సంపాదించి దాచడం కాదు.. దాని విలువను కాపాడుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది తమ డబ్బు బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో సురక్షితంగా ఉందనుకుంటారు. ద్రవ్యోల్బణంతో కాలక్రమేణా పెరిగే వస్తువులు సేవల ధరలు నిశ్శబ్దంగా మీ డబ్బు విలువను చదపురుగుల్లా తినేస్తుందని చాలా మంది గమనించరు. ఒక రకంగా చెప్పాలంటే.. మీ అకౌంట్లో రూ.100 అలాగే ఉంటుంది కానీ 10 ఏళ్ల తర్వాత దానితో వచ్చే వస్తువుల రేటు పెరుగుదలతో దాని విలువ సగానికి పడిపోతుంది. అందుకే ద్రవ్యోల్బణం వల్ల కొనుగోలు శక్తిని కోల్పోవడమే కుటుంబాలకు అతిపెద్ద ఆర్థిక ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం చేసే సాంప్రదాయ పెట్టుబడులు కాగితం మీద లాభాలను చూపిస్తాయి.. అయితే నిజమైన సంపదను సృష్టించలేవు. ఉదాహరణకు మీరు ఒక బ్యాంక్ ఎఫ్‌డీలో దాచిన కోటి రూపాయల డబ్బు10 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.కోటి 79లక్షలుగా మారవచ్చు. చూడటానికి ఇది చాలా పెద్ద మొత్తంగా అనిపించినా.. పదేళ్ల తర్వాత ఆ డబ్బుతో కొనగలిగే వస్తువుల విలువ నేటి కాలపు రూ. కోటితో సమానం అవుతుంది. అంటే ట్యాక్సులు, ద్రవ్యోల్బణం పోను మీకు మిగిలే 'నిజమైన రాబడి' చాలా తక్కువ.
లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్..
ధరల పెరుగుదల అనేది కేవలం కూరగాయలు, పెట్రోల్‌కే పరిమితం కాదు. వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, ఇండ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు వేగంగా పెరిగిపోతున్నాయ్. ఈ రోజు ఒక కుటుంబానికి నెలకు రూ.లక్ష ఖర్చు అవుతుంటే.. రాబోయే పదేళ్లలో అదే జీవితాన్ని వారు కొనసాగించాలంటే నెలకు రూ.లక్షా 80వేల నుండి రూ.2 లక్షల వరకు అవసరమవుతుంది. కేవలం సాధారణ పొదుపు పథకాలపై ఆధారపడే వారికి ఈ ద్రవ్యోల్బణం పెద్ద తలనొప్పిగా మారనుంది.
ఏడాదికి 5 నుండి 6 శాతం వడ్డీ ఇచ్చే సాంప్రదాయ సేవింగ్స్ ప్రొడక్ట్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా 6 శాతం ఉండి.. దానికి తోడు పన్నులు కూడా తోడైతే మీ డబ్బు విలువ పెరగనట్లే లెక్క. బ్యాంకులోని రూపాయల సంఖ్య తగ్గకపోవచ్చు.. కానీ భవిష్యత్తులో ఆ రూపాయలతో మనం కొనగలిగే వస్తువుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే కేవలం సేఫ్టీ కోసమే నిర్మించుకునే పోర్ట్‌ఫోలియో భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు అస్సలు సురక్షితం కాదు.
స్మార్ట్ ఇన్వెస్టర్లు చేయాల్సింది ఇదే..
ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని సంపద పెంచుకోవాలంటే సరైన అసెట్ అలోకేషన్ చాలా ముఖ్యం. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఈక్విటీ ఫండ్స్, స్థిరత్వం కోసం డెట్ ఫండ్స్, అనిశ్చితిని తట్టుకోవడానికి గోల్డ్, అత్యవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కోసం డబ్బును కేటాయించాలి. సంపద సృష్టి అంటే ఎంత డబ్బు కూడబెట్టామనేది కాదు.. 10 ఏళ్ల తర్వాత కూడా ఆ డబ్బు మనకు ఎలాంటి జీవితాన్ని కొనివ్వగలదనేదే అసలు విషయం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
