అమెరికాలో నివసిస్తున్న వలసదారులతో పాటు విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికాలో లోన్స్, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న విదేశీయుల చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ స్టేటస్ చెక్ చేయాలని ట్రంప్ ఒక కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారు బ్యాంక్ ఖాతాలు తెరవడం, రుణాలు పొందడంపై ట్రంప్ యంత్రాంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విదేశీయుల పూర్తి వివరాలు, వారి వీసా స్టేటస్ తనిఖీ చేసిన తర్వాతే ఆర్థిక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త మార్గదర్శకాలను తెచ్చారట.
మొదట్లో ఈ రూల్స్ అత్యంత కఠినంగా ఉంటాయని.. ప్రతి బ్యాంక్ ఖాతాదారుడి పౌరసత్వ వివరాలను సేకరించడాన్ని నిర్బంధం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి కారణంగా ఫైనల్ ఉత్తర్వుల్లో కొంత సడలింపు ఇచ్చారు. ఖాతాదారుల వీసా, పౌరసత్వ డేటాను సేకరించాలని బ్యాంకులను బలవంతం చేసే కఠినమైన నిబంధనను పక్కన పెట్టి, ప్రస్తుతానికి కేవలం మార్గదర్శకాల రూపంలోనే ఈ ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ బ్యాంకులు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను తెలుసుకోవాలనే సూత్రానికి ఇది మరింత బలాన్ని చేకూర్చింది.
వలసదారులు, విదేశీయులు రుణాలు తీసుకున్న తర్వాత ఒకవేళ దేశం నుంచి డిపోర్ట్ చేయబడితే.. వారు తీసుకున్న బకాయిలను బ్యాంకులు తిరిగి వసూలు చేయలేవని వైట్ హౌస్ వాదిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. లీగల్ స్టేటస్ లేని విదేశీ వలసదారులకు క్రెడిట్ ఫెసిలిటీ, ఆర్థిక సేవలు విస్తరించడం వల్ల బ్యాంకింగ్ రంగానికి ఎదురయ్యే నష్టాలను తాము అనుమతించబోమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో ఇప్పటివరకు ఖాతాదారుల ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను ప్రామాణికంగా సేకరించలేదు. అందువల్ల ఇలాంటి రుణాల వల్ల ఎంత నష్టం జరుగుతుందనేదానికి ఖచ్చితమైన లెక్కలు లేవు. అర్బన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. సోషల్ సెక్యూరిటీ నంబర్ లేని విదేశీయులు పన్నులు చెల్లించడానికి ఉపయోగించే ఐటిఐఎన్ నంబర్ ద్వారా కేవలం 5వేల నుండి 6వేల వరకు మాత్రమే హోమ్ లోన్స్ తీసుకున్నారు. పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫ్యానీ మే, ఫ్రెడ్డీ మాక్ వంటి సంస్థలు వీరికి మార్ట్‌గేజ్ సపోర్ట్ ఇవ్వడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఈ తనిఖీలను తెరపైకి తీసుకురావటం ఇప్పుడు అక్కడి విదేశీయుల్లో కొత్త ఆందోళనలకు దారితీసింది.
ALSO READ : ట్రంప్ స్టూడెంట్ లోన్స్ నిర్ణయంపై భగ్గుమన్న అమెరికా..
ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయంపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా వీసా, లీగల్ స్టేటస్ తనిఖీల పేరిట నిబంధనలు కఠినతరం చేస్తే.. చట్టబద్ధమైన పత్రాలు లేని వలసదారులు బ్యాంకింగ్ వ్యవస్థకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల బ్యాంక్ అకౌంట్లు లేని వారి సంఖ్య పెరిగి సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది విదేశీయుల రోజువారీ ఆర్థిక లావాదేవీలపై ముఖ్యంగా లోన్లు, క్రెడిట్ కార్డుల లభ్యతపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.
