ట్రంప్ స్టూడెంట్ లోన్స్‌ నిర్ణయంపై భగ్గుమన్న అమెరికా.. కోర్టుకెక్కిన 24 రాష్ట్రాలు: భారతీయులపై ఎఫెక్ట్ ఉంటుందా?

ట్రంప్ స్టూడెంట్ లోన్స్‌ నిర్ణయంపై భగ్గుమన్న అమెరికా.. కోర్టుకెక్కిన 24 రాష్ట్రాలు: భారతీయులపై ఎఫెక్ట్ ఉంటుందా?

అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ స్టూడెంట్ లోన్స్ పై తీసుకొచ్చిన కొత్త రూల్స్ అక్కడ పెద్ద రాజకీయ, చట్టపరమైన వివాదానికి దారితీశాయి. ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది ఆమోదించిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' ద్వారా ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలపై గరిష్ట పరిమితులను విధించింది. దీని ప్రకారం సాధారణ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వార్షిక రుణ పరిమితిని 20వేల 500 డాలర్లకు, జీవితకాల పరిమితిని లక్ష డాలర్లకు కుదించారు. అయితే మెడికల్, లా, దంతవైద్యం వంటి 11 రకాల ప్రత్యేక ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రం ఏడాదికి 50వేల డాలర్లు.. మొత్తంగా 2లక్షల డాలర్ల వరకు లోన్ పొందేందుకు మినహాయింపు ఇచ్చారు. 

ఈ లిస్ట్ నుండి నర్సింగ్, ఫిజికల్ థెరపీ, నర్స్ అనస్థీషియా వంటి కీలకమైన హెల్త్‌కేర్ కోర్సులను ట్రంప్ ప్రభుత్వం మినహాయించడం తీవ్ర వివాదాస్పదమైంది.  ట్రంప్ ప్రభుత్వపు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 24 రాష్ట్రాలు, డెమొక్రాట్ ప్రతినిధులు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కలిసి ఫెడరల్ కోర్టులో దావా వేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్, అమెరికన్ నర్సెస్ అసోసియేషన్ ఈ రూల్స్ ను తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే అమెరికా హెల్త్ కేర్ రంగం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి సమయంలో నర్సింగ్ వంటి కోర్సులకు రుణ పరిమితి తగ్గించడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే నర్స్ ప్రాక్టీషనర్లు, మిడ్‌వైఫ్‌ల సంఖ్య తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. 

కాంగ్రెస్ ఆమోదించిన చట్టాన్ని ట్రంప్ యంత్రాంగం నిరంకుశంగా మార్చివేసిందని.. 1950ల నాటి పాత రూల్స్ ఆధారంగా నర్సింగ్‌ను ప్రొఫెషనల్ కోర్సుల జాబితా నుండి తొలగించిందని వారు కోర్టును ఆశ్రయించారు.  మరోవైపు విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మహన్ ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటున్నారు. విద్యాసంస్థలు తమ ఫీజులను విపరీతంగా పెంచకుండా నియంత్రించడానికే ఈ రుణ పరిమితులను తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. లోన్ పరిమితి తగ్గితే విశ్వవిద్యాలయాలు తమ కోర్సుల ధరలను తగ్గించక తప్పదని.. ఇది దీర్ఘకాలంలో విద్యార్థులకే మేలు చేస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాకుండా 80 శాతం మంది నర్సింగ్ సిబ్బందికి కేవలం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలే ఉంటాయని, వాటిపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ యూనివర్సిటీలు ఫీజులు తగ్గించకపోతే విద్యార్థులు అధిక వడ్డీలతో కూడిన ప్రైవేట్ లోన్లపై ఆధారపడవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మెుత్తానికి ట్రంప్ సర్కార్ కొత్త లోన్ రూల్స్ కారణంగా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులపై.. ముఖ్యంగా హెల్త్‌కేర్ అండ్ నర్సింగ్ రంగాల్లోకి వెళ్లాలనుకునే వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డ్ ఉండి ఫెడరల్ లోన్స్ పొందే భారతీయ సంతతి విద్యార్థులు నేరుగా ఈ ఆర్థిక భారానికి గురవుతారు. ఇక అంతర్జాతీయ భారతీయ విద్యార్థుల విషయానికొస్తే.. ఫెడరల్ లోన్స్ తగ్గడం వల్ల అమెరికన్ విద్యార్థులు ప్రైవేట్ లోన్స్ వైపు మళ్లి భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నిధుల కొరతతో బాధపడే అమెరికన్ యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజులను మరింత పెంచే అవకాశం ఉందని.. దీంతో భారతీయ విద్యార్థులకు అమెరికా చదువు మరింత భారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.