స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఇన్వెస్టర్ల నష్టాలకు కారణాలు ఇవే..

స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఇన్వెస్టర్ల నష్టాలకు కారణాలు ఇవే..

దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం నష్టాల తర్వాత కొత్త వారాన్ని కూడా భారీ పతనంతో స్టార్ట్ చేశాయి. దీంతో సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలి ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 10.19 గంటల సమయంలో  బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 825 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 764 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 840 పాయింట్ల మేర నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర కుప్పకూలటంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. 

మన స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరగటానికి వివిధ కారణాలను పరిశీలిస్తే.. 

1. బెంబేలెత్తిస్తున్న క్రూడ్ ధరలు..
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.79 శాతం పెరిగి బ్యారెల్‌కు 111.2 డాలర్లకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. భారత్ తన ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి.. ఈ అధిక ధరలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఆర్థిక వృద్ధిని, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను దెబ్బతీస్తాయి.

2. చారిత్రాత్మక కనిష్టానికి రూపాయి..
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గత ముగింపు కంటే 44 పైసలు క్షీణించి, రికార్డు స్థాయిలో 96.25కు పడిపోయింది. ముడి చమురు ధరల పెరుగుదల, బలమైన డాలర్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బలహీనపడుతున్న రూపాయి దేశీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

3. మిడిల్ ఈస్ట్‌లో పెరిగిన ఉద్రిక్తతలు..
UAEలోని బరాకా అణు కర్మాగారంపై ఆదివారం జరిగిన డ్రోన్ దాడి మార్కెట్లలో ఆందోళనలను పెంచింది. దీనికి తోడు, ఇరాన్‌తో చర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. "సమయం మించిపోతోంది, వేగంగా అడుగులు వేయండి" అని అనడం గ్లోబల్ మార్కెట్లలో భయాన్ని సృష్టించింది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరా మార్గాలకు ఆటంకం కలగవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

4. ప్రతికూల గ్లోబల్ మార్కెట్లు.. 
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ధైర్యం సన్నగిల్లింది. ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ వంటివి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే అమెరికా మార్కెట్లు కూడా గత శుక్రవారం 1 శాతానికి పైగా నష్టపోవడంతో పాటు.. నాస్‌డాక్, ఎస్&పి 500 ఫ్యూచర్స్ కూడా పతనమవ్వడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

5. పెరిగిన ఇండియా విక్స్..
మార్కెట్లో ఉన్న భయాన్ని, అస్థిరతను కొలిచే ఇండియా విక్స్ సూచీ 6 శాతానికి పైగా పెరిగి 19.92 వద్దకు చేరింది. ఓలటాలిటీ ఇండెక్స్ ఈ స్థాయిలో పెరగడం అనేది పెట్టుబడిదారులలో ఉన్న తీవ్ర ఆందోళనను, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని నైజాన్నిసూచిస్తుంది. ఇది మార్కెట్లో షేర్ల ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవడానికి దారితీసింది.