- కోర్సు ఉన్నదే నాలుగున్నర ఏండ్లు.. ఐదేండ్ల ఫీజు ఎట్లా కడుతారని మెడికల్ కాలేజీలపై వర్సిటీ ఆగ్రహం
- ఐదు వాయిదాల్లోనే వసూలు చేసుకోవాలని సూచన
- ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయొద్దని వర్సిటీ రిజిస్ట్రార్ అల్టిమేటం
- జీవో 106 పక్కాగా ఫాలో కావాల్సిందేనని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎంబీబీఎస్ చదివే పిల్లల దగ్గర నాలుగున్నర ఏండ్లకే ఫీజు వసూలు చేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు, డీన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నర ఏండ్లు మాత్రమే ఉంటుంది. కానీ, కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి ఐదేండ్ల ఫీజు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో, కోర్సు టైమ్ ఎంత ఉంటే అంతే ఫీజు తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది.
చేస్తున్నట్లు వర్సిటీ దృష్టికి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన వర్సిటీ.. "కోర్సు ఎంత కాలం ఉంటే అంతే ఫీజు తీసుకోవాలె. ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా చెల్లుబాటు కాదు" అని స్పష్టం చేసింది. విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఒక్కసారిగా భారం పడొద్దని వర్సిటీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మొత్తం కోర్సు ఫీజును ఐదు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని ఆదేశించింది. అంటే.. మొత్తం నాలుగున్నర ఏండ్ల ఫీజును ఐదు భాగాలుగా చేసి, ఏటా ఒక వాయిదా చొప్పున కట్టించుకోవాలి. దీనివల్ల మధ్యతరగతి పిల్లలకు ఫీజుల తిప్పలు తప్పనున్నాయి.
నిబంధనలు మీరితే చర్యలు తప్పవు...
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 106 తో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను కాలేజీలు పక్కాగా అమలు చేయాలని వర్సిటీ ఆదేశించింది. ‘‘ఫీజుల వసూళ్లలో ఏ చిన్న తప్పు జరిగినా, ఉల్లంఘనలకు పాల్పడినా సీరియస్ యాక్షన్ ఉంటుంది. రూల్స్ మీరే కాలేజీలపై చట్టపరంగా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’అని రిజిస్ట్రార్ హెచ్చరించారు. ఫీజుల వివరాలు, ప్రతి విద్యార్థికి తెలిసేలా కాలేజీ నోటీసు బోర్డుల మీద తప్పనిసరిగా ప్రదర్శించాలని వర్సిటీ పేర్కొన్నది. కాలేజీ యాజమాన్యాలు ఏవైనా కొర్రీలు పెట్టినా, నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నా విద్యార్థులు నేరుగా వర్సిటీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. అకడమిక్ , అడ్మినిస్ట్రేటివ్ నిబంధనలను పక్కాగా ఫాలో కావాలని, ఏ విషయంలోనైనా పారదర్శకత ఉండాలని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసింది.

