- ఇతర రాష్ట్రాలవారికి తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ వర్తించదు: కాళోజీ వర్సిటీ
- ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిపోర్టుతో ఓపెన్ కేటగిరీకి మార్పు
- ఇప్పటికే 1, 2 విడతల్లో సీట్లు పొందిన 9 మంది అడ్మిషన్లు రద్దు
- మాప్-అప్ కౌన్సెలింగ్ లో అర్హులైన ఎస్టీలకే వాటిని అలాట్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎస్టీ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం.. అర్హత లేని 37 మంది అభ్యర్థులను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఓపెన్ కేటగిరీకి మారుస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇప్పటికే మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ లలో షరతులతో కూడిన ఎస్టీ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్న 9 మంది అభ్యర్థుల సీట్లను రద్దు చేసింది.
వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆర్వీఎం, ఈఎస్ఐసీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ (ఇద్దరు), రాజరాజేశ్వరి, నోవా, కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, టీఆర్ఆర్ కాలేజీల్లో సీట్లు పొందిన బుక్కే విశ్రుత్, ఎరుకుల హేమాద్రి, నెనావత్ కోవిద, మాలే సాయి హర్షిణి, కాకి నాగశయన, శంకరపురం రచన, దేవరశెట్టి నిహాల్ సిద్ధార్థ్, వాడితె చంద్ర హర్షిణి, ఎం. గాయత్రి చౌహాన్ అడ్మిషన్లను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది.
రిపోర్టు ఆధారంగా వర్సిటీ చర్యలు
రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వర్సిటీ ఈ చర్యలు చేపట్టింది. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి గతంలో తెలంగాణకు వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారికి ఇక్కడి స్థానిక ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అధికారులు ప్రస్తావించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95 కింద ఉన్న పదేళ్ల ఉమ్మడి ప్రవేశాల గడువు కూడా 2024 జూన్ 1తో ముగియడంతో, వీరు తెలంగాణ ఎస్టీ కోటాకు అర్హులు కారని తేలింది.
ఈ నేపథ్యంలో రద్దయిన 9 ఎంబీబీఎస్ సీట్లను ఖాళీలుగా గుర్తించి, తదుపరి నిర్వహించే మూడో విడత లేదా మాప్-అప్ కౌన్సెలింగ్ లో మెరిట్ ప్రకారం అర్హులైన తెలంగాణ ఎస్టీ అభ్యర్థులకే కేటాయించనున్నారు. అనర్హులుగా తేలిన 37 మంది అభ్యర్థులను ఇకపై తదుపరి విడతల్లో జనరల్ (ఓపెన్) కేటగిరీ కింద మాత్రమే పరిగణించనున్నారు.
