టయోటా నుంచి వంద శాతం ఇథనాల్ కారు.. వచ్చే నెల లాంచ్: కేంద్ర మంత్రి గడ్కరీ

టయోటా నుంచి వంద శాతం ఇథనాల్ కారు.. వచ్చే నెల లాంచ్: కేంద్ర మంత్రి గడ్కరీ

 న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌తో ఏమాత్రం పనిలేకుండా, పూర్తిగా 100 శాతం ఇథనాల్‌‌‌‌తో నడిచే సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు వచ్చే నెలలో మార్కెట్లోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ కారు రన్నింగ్ కాస్ట్  చాలా తక్కువని, లీటర్ పెట్రోల్‌‌‌‌ కోసం రూ.25 ఖర్చు చేసే రేంజ్‌‌‌‌లోనే ఉంటుందని  స్పష్టం చేశారు.  ‘‘100శాతం ఇథనాల్‌‌‌‌తో నడిచే ఇన్నోవా కారు లాంచ్‌‌‌‌కు టయోటా  నన్ను ఆహ్వానించింది.

ఈ బండి నడుస్తున్న టైమ్‌‌‌‌లో 60 శాతం విద్యుత్‌‌‌‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది”అని గడ్కరీ తెలిపారు. పెట్రోల్‌‌‌‌లో 20శాతం ఇథనాల్ కలిపే (ఈ20) విధానంపై మైలేజ్, ఇంజిన్ పనితీరుపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచంలోని 19 దేశాల్లో ఇథనాల్ వాడుతున్నారని, భారత్‌‌‌‌లో ఇప్పటివరకు వాహనాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ల్యాబ్ పరీక్షలు, ట్రయల్స్ ఆధారంగానే ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. 

రైతులు శక్తిదాతలు

ఇథనాల్ తయారీ వల్ల మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరిగి, రైతులు ‘అన్నదాతల’ నుంచి 'శక్తి దాతలు'గా మారుతున్నారని గడ్కరీ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌‌‌‌లో మారుతి సుజుకి ఈ–20 నుంచి  ఈ–85 వరకు ఇథనాల్‌తో నడిచే  తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్‌‌‌‌ను పరిచయం చేసింది.  

మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  టూవీలర్ రైడర్లు డబ్బు సంపాదించుకునేందుకు  యాప్ ఆధారిత 'బైక్ ట్యాక్సీ' సేవలను విస్తరించాలని రాష్ట్రాల రవాణా మంత్రులను కోరినట్లు గడ్కరీ తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.