పాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 12 మందిని పొట్టన పెట్టుకున్నారు

పాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 12 మందిని పొట్టన పెట్టుకున్నారు
  •  ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌ లో18 మందికి గాయాలు

పెషావర్: పాకిస్తాన్‌‌‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా దరాజిందా తహసీల్‌‌‌‌లోని అమన్ మేళా పోలీసు చెక్‌‌‌‌పోస్టుపై శనివారం శక్తిమంతమైన ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నింపిన ట్రాక్టర్-ట్రాలీలో వచ్చిన టెర్రరిస్ట్.. వాహనంతో పాటు చెక్‌‌‌‌పోస్టుపైకి దూసుకెళ్లడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు, మహిళలు, కస్టమ్స్ అధికారులతో సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

పేలుడు తీవ్రతకు చెక్‌‌‌‌పోస్టు భవనం పూర్తిగా నేలమట్టం కావడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ, అత్యవసర బృందాలు, సైనిక బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను జిల్లా ప్రధానాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ దాడికి తామే కారణమని నిషేధిత 'తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్' (టీటీపీ) అధికారికంగా ప్రకటించింది.

 పేలుడు తీవ్రతను అంచనా వేయడానికి బాంబ్ డిస్పోజల్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించి నమూనాలను సేకరించాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. వారం రోజుల కింద  కోహాట్ జిల్లాలో జరిగిన మరో దాడిలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.