జనగామ, వెలుగు: తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సభలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
వచ్చే దసరా నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.18 లక్షల ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, విద్యారంగాన్ని సైతం బలోపేతం చేస్తున్నామన్నారు.
ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరి కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. అప్పుల భారం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
అనంతరం పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. తర్వాత చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని ప్రారంభించి, మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించిన 54 మందికి నియామక పత్రాలు అందజేశారు.
అలాగే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) పనులు, తరిగొప్పుల తహసీల్దార్ఆఫీసు నిర్మాణ పనులతో పాటు అనేక అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్రనాయక్, అడిషనల్ కలెక్టర్బెన్షాలోమ్ పాల్గొన్నారు.
