దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డులో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టగా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన సుమారు 70 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించి గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో పారేశారు.
ఆహార తయారీ ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన పదార్థాలను మాత్రమే వాడాలని నిర్వాహకులను హెచ్చరించారు. పలు హోటళ్లలో ఆహార నమూనాలను సేకరించిన అధికారులు, ప్రతి యజమాని తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలని, వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని స్పష్టం చేశారు.
