- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరి భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి వల్లే తెలంగాణ వచ్చినట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసిందని ఆరోపించారు.
పదేళ్లుగా ఉద్యమకారుల ప్రస్తావన, ఉనికి లేకుండా ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 4న జరిగే అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారులతో కూడా కమిటీ చర్చలు జరుపుతుందని, అనంతరం విధివిధానాలను ఖరారు చేస్తామని కోదండరామ్ వెల్లడించారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కమిటీ సభ్యులు మోతే శోభన్‌రెడ్డి, జ్యోతిరెడ్డి, ఐలయ్య యాదవ్, సంజీవరెడ్డి, రజనీకాంత్, దయానంద్, జగన్ యాదవ్, శీలం స్వామి, కొట్టే శేఖర్, ఆనంద్, భూపాల్, ఐలా ప్రసన్న, అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘సోషియల్ ఫర్ స్పెక్టివ్స్’ ఆవిష్కరణ
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త డాక్టర్ నీలం సంపత్ రచించిన సోషియల్ ఫర్ స్పెక్టివ్స్ పుస్తకావిష్కరణ సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ తెలుగు పరిశోధక మండలి ఆధ్వర్యంలో జరిగింది. గెస్ట్‌గా కోదండరామ్ హాజరై మాట్లాడారు. నిరంతరం అధ్యయనం చేస్తేనే వ్యాసాలు రాయడం సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ అల్లం నారాయణ, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఓఎస్డీ కె.విద్యాసాగర్ రావు, ఏఐఎఫ్ఆర్ యూసీటీవో ఫైనాన్స్ సెక్రటరీ ఆర్విణి రాజేంద్రబాబు, ఎ.పుల్లయ్య, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఏవీవీ ప్రసాద్, కృష్ణమూర్తి, పుస్తక రచయిత డాక్టర్ నీలం సంపత్ పాల్గొన్నారు.
