- రాష్ట్రంలోని వనరులపై ఏపీ నేతల కన్నుపడింది: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వనరులపై ఏపీ పాలకుల కన్ను పడిందని, ఇక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు విషయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ, ఆ సాకుతో తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆంధ్రా పాలకవర్గాలకు మద్దతుగా నిలుస్తూ తెలంగాణపై పెత్తనం చలాయించాలని చూస్తోందన్నారు. తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్రా పాలకుల అనవసర జోక్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
పదేపదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా కేంద్రంలోని బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం ఇక్కడి ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని మండిపడ్డారు. రాజ్యాంగం వెలుగులో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మహనీయులకు కోదండరాం నివాళి అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది అమరుల త్యాగఫలం, లక్షలాది మంది ఉద్యమకారుల పోరాటం, కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
కుట్రలను తిప్పికొట్టాలి..
తెలంగాణపై బీజేపీ, ఆంధ్రా పాలకవర్గాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తెలంగాణ అంటే తాము, తమ కుటుంబమే అన్న భావనతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ నియంతృత్వ పాలన సాగించిందని విమర్శించారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు తగ్గట్టుగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొట్లాడామని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంలో గతంలా వేధింపులు లేవన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కోదండరాం నివాళులర్పించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని బీజేపీ గౌరవించడం లేదు
నారాయణగూడ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించడం లేదని, అదే విధానాన్ని ఆంధ్ర ప్రాంత పాలకులు కూడా అనుసరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని తెలంగాణ తెలుగు అకాడమీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణతో కలిసి కోదండరాం పాల్గొన్నారు.
