- గోల్డెన్ మైల్‌లో రూ.115 కోట్లు
- రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని నిరూపించిన ఈ–వేలం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు ఏమాత్రం తగ్గలేదని కోకాపేట్ ఈ–-వేలం మరోసారి నిరూపించింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నియోపోలిస్, గోల్డెన్ మైల్ సైట్1లోని ప్లాట్ల వేలంలో రికార్డు స్థాయిలో బిడ్లు నమోదయ్యాయి. నియోపోలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల ప్లాట్‌కు ఎకరా రూ.120 కోట్ల చొప్పున బిడ్ దాఖలైంది.
అలాగే, గోల్డెన్ మైల్‌లో 0.70 ఎకరాల ప్లాట్ ఎకరా రూ.115 కోట్లు పలికింది. ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు సమీపంలో ఉండటం, మెరుగైన రోడ్ కనెక్టివిటీ ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని రియల్ఎస్టేట్వర్గాలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్ విస్తరణ నేపథ్యంలో వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి ఈ ప్రాంతం అత్యంత కీలక గమ్యస్థానంగా మారుతున్నట్లు తాజా ధరలు స్పష్టం చేస్తున్నాయి.
