కోల్‌కతాలో యువతిపై గ్యాంగ్‌రేప్‌.. బర్త్ డే సెలెబ్రేషన్స్ కి తీసుకెళ్లి ఫ్రెండ్స్ అఘాయిత్యం..

కోల్‌కతాలో యువతిపై గ్యాంగ్‌రేప్‌.. బర్త్ డే సెలెబ్రేషన్స్ కి తీసుకెళ్లి ఫ్రెండ్స్ అఘాయిత్యం..
  • పరారీలో ఇద్దరు నిందితులు 

కోల్‌కతా: బెంగాల్‌లోని కోల్‌కతాలో 20 ఏండ్ల యువతిపై ఆమె ఫ్రెండ్స్‌ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బర్త్‌ డే నేపథ్యంలో సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తామని పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిదేవ్‌పూర్‌కు చెందిన యువతికి చందన్ మాలిక్, దీప్ అనే ఇద్దరితో కొన్ని నెలల కింద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం యువతి బర్త్‌ డే ఉండగా, సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తామని చందన్ మాలిక్, దీప్ చెప్పారు. ఆమెను దీప్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. 

ఆ తర్వాత డోర్‌ లాక్ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. శనివారం ఉదయం 10:30 గంటలకు ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారని, వాళ్ల కోసం గాలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. 

కాగా, ‘‘కొన్ని నెలల కింద చందన్ పరిచయమయ్యాడు. సౌత్ కోల్‌కతాలోని దుర్గా పూజ కమిటీకి హెడ్‌ అని చెప్పాడు. అతని ద్వారా దీప్ పరిచయమయ్యాడు. దుర్గా పూజ కమిటీలో చోటు కల్పిస్తామని చందన్, దీప్‌ నన్ను నమ్మించారు” అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.