- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నల్గొండ ఎస్ఎల్బీసీ సమీపంలో రూ.5 కోట్లతో పెట్రోల్ బంకు, సూపర్ మార్కెట్, రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి భూమిపూజ చేసి, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నల్గొండను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు.
చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని, అందుకే ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగ్, రూ.80 కోట్లతో ఏటీసీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు.
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా రూ.50 కోట్లతో పునుగోడు, కాంచనపల్లి, రేగట్ట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టామని, కనగల్‌లో రూ.1.20 కోట్లతో గోడౌన్, రూ.16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కనగల్ - నల్గొండ మధ్య పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై మండల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బి. చంద్రశేఖర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
