పవన్ కల్యాణ్ అక్కసు బయటపెట్టిండు...అదే ద్వేషం, వివక్ష కనపడుతుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పవన్ కల్యాణ్ అక్కసు బయటపెట్టిండు...అదే ద్వేషం, వివక్ష కనపడుతుంది :  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  •     ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రజలంతా సంబురాలు జరుపుకుంటుంటే.. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  తెలంగాణ గడ్డపై నిలబడి మళ్లీ అక్కసు బయటపెట్టిండని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ అంటే అనువణువునా అదే ద్వేషం, అదే వివక్ష ఇంకా వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ వాడిన భాష చూస్తుంటే రక్తం మరుగుతున్నది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న మా అమరవీరులను అవమానించే విధంగా మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి త్యాగం చేసి, ఆమరణ నిరహార దీక్ష చేసిన చరిత్ర మాది. టీడీపీ, బీజేపీ కలిసి తెలంగాణపై మళ్లీ కుట్రలు చేస్తున్నట్లు మాకు అనుమానం కలుగుతున్నది. ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి కానీ, తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం, బరిగీసి నిలబడతాం.. తస్మాత్ జాగ్రత్త’’ అని మంత్రి హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలి.. తప్ప ప్రాంతీయ విద్వేషాల్లో కాదని తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై దృష్టి సారించాలని హితవుపలికారు.