మల్లన్న క్షేత్రం బండారిమయం.. కొమురవెల్లిలో ఘనంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు

మల్లన్న క్షేత్రం బండారిమయం..  కొమురవెల్లిలో ఘనంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు

     భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారం (మొదటి ఆదివారం)ను పురస్కరించుకొని ఆలయ తోటబావి వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్‌‌కు చెందిన మానుక పోచయ్య యాదవ్‌‌ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్‌‌ యాదవ్, యాదవ సంఘం సభ్యులు, ఈవో వెంకటేశ్, ఆలయ చైర్మన్ నర్సింహారెడ్డి, శివసత్తులు, భక్తుల ఆధ్వర్యంలో 25 వరుసల పెద్దపట్నం వేశారు. అనంతరం సమిధలు కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అర్చకులు మహాదేవుని మల్లికార్జున్‌‌తో పాటు ఆలయ సిబ్బంది స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగింపుగా పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం, అగ్నిగుండాలు దాటారు. తోటబావి వద్ద భక్తులు పసుపు చల్లుకోవడంతో ఆలయ ప్రాంగణం, రాజగోపురం మొత్తం బండారిమయమైంది. అనంతరం ఆలయ ఆఫీసర్లు హైదరబాద్‌‌కు చెందిన యాదవ భక్తులకు, శివసత్తులకు కొత్త బట్టలు పెట్టి, బండారు పంపిణీ చేశారు.

భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి పెద్దపట్నాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు రావడంతో కొమురవెల్లి కిటకిటలాడింది. భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండాలను తిలకించేందుకు వీలుగా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పెద్దపట్నం, అగ్నిగుండాలను దాటిన తర్వాత భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలను దాటుతూ స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్దపట్నం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.