మూసీ పునరుజ్జీవం: మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి

మూసీ పునరుజ్జీవం: మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక ప్రకటన చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 55 కి.మీ. మేర మూసీ పునరుజ్జీవం చేస్తామన్నారు. మూసీలోకి మురుగు నీరు చేరకుండా 39 ఎస్టీపీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రసంగంలో పేర్కొన్నారు. 

సోమవారం (మార్చి 16) అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమమే  లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ప్రజాపాలన మార్గదర్శకాల సూత్రాలను సభ ప్రతిబింభిస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. 

2047 తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా పాలన సాగుతున్నట్లు ప్రసంగంలో పేర్కొన్నారు గవర్నర్. 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్లుగా మార్పు చేసినట్లు చెప్పారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా పాలన చేస్తున్నట్లు చెప్పారు. కోర్, ప్యూర్, రేర్ గా తెలంగాణను విభజించామన్నారు. ప్రజలకు భద్రత కల్పించేలా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశామన్నారు.  ORR లా రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. RRR చుట్టూ MSME పార్కులు రాబోతున్నాయని తెలిపారు.  హిస్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల బదలాయింపు చేస్తామన్నారు.