ప్రభుత్వం సాహసోపేతమైన విజనరీతో ముందుకెళ్తుంది : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

ప్రభుత్వం సాహసోపేతమైన విజనరీతో ముందుకెళ్తుంది : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో తొలిరోజు భాగంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం లక్ష్య సాధనలో.. అందరికీ అభివృద్ధి.. భవిష్యత్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అన్నారు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. 

విజన్ 2047 దిశగా.. సాహసోపేతమైన విధానాలతో.. విజనరీతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు గవర్నర్. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు గవర్నర్ శుక్లా.

గతానికి భిన్నంగా ఈ దఫా అసెంబ్లీ భవనంలోని  కొత్త హాల్‌‌‌‌లో శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రూ. 20 వేల కోట్లు పెరగనున్న పద్దు..?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో  రానున్న 2026-–27  బడ్జెట్‌‌‌‌ లెక్కలు అత్యంత కీలకంగా మారాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ. 3.04 లక్షల కోట్ల బడ్జెట్‌‌‌‌ను అంచనా వేసింది. ఈ భారీ బడ్జెట్ అంచనాలతోనే గత ఏడాది కాలంగా పలు అభివృద్ధి పనులను సర్కారు నెట్టుకొచ్చింది. అయితే కొత్త స్కీమ్స్‌‌‌‌, హామీలు మరిన్ని అమలు చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తున్నది. 

ఇప్పటికే అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. ప్రతిపాదనలపై ఒక అంచనాకు వచ్చారు. ఆసరా నిధుల పెంపుతోపాటు ప్రధానంగా సంక్షేమ రంగానికి, వ్యవసాయం, విద్య, వైద్య , సాగునీటి రంగాలకు ఈ సారి కేటాయింపులు పెరగనున్నట్టు తెలుస్తున్నది. ఈ సారి బడ్జెట్‌‌‌‌ 2027-–28లో 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పథకాల అమలు, పాత పథకాలకు నిధుల సర్దుబాటు కోసం ఈ పెంపు సర్కారుకు అనివార్యంగా మారింది. 

అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల వాటా కాస్తా ఈ సారి పెరగనుంది. దీంతో వీటిపై ఆధారపడి కూడా బడ్జెట్ కసరత్తు జరుగుతున్నది.  పెరిగిన బడ్జెట్ అంచనాలకు తగినట్టుగా కొత్త ఆదాయ మార్గాలను కూడా ప్రతిపాదించనుంది. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రభుత్వ ఆదాయం 85 శాతం వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నేతర ఆదాయం తగ్గింది. రూ.31 వేల కోట్లు అంచనా వేయగా.. ఇప్పటి వరకి 8,500 కోట్ల మేర వచ్చింది. 70 శాతం మేర లోటు ఉంది. అదే పన్ను ఆదాయం ఫిబ్రవరి నాటికి 1.75 లక్షల కోట్లకు 1.40 లక్షల కోట్లు వసూలయ్యాయి.