మల్లన్న ‘క్యూ కాంప్లెక్స్’ పూర్తయ్యేదెన్నడో ? మూడేండ్లుగా కొనసాగుతున్న పనులు

మల్లన్న ‘క్యూ కాంప్లెక్స్’  పూర్తయ్యేదెన్నడో ? మూడేండ్లుగా కొనసాగుతున్న పనులు
  • కోటి రూపాయల పెండింగ్ పనులపై సందిగ్ధత
  • ఎండ, వానలోనే మల్లన్న భక్తుల దర్శనాలు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం మూడేండ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ప్రతివారం పాతిక వేలకు పైగా భక్తులు మల్లన్న దర్శనానికి వస్తుండటంతో, వారి ఇబ్బందిని తొలగించడానికి ఆలయ రాజగోపురానికి ఎడమ వైపున ఎకరం స్థలంలో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి తరహాలో సుమారు రూ.12 కోట్ల దేవాలయ నిధులతో జీ ప్లస్ టూ పద్ధతిలో అత్యాధునిక వసతులతో దీన్ని ప్లాన్ చేశారు. తాగునీటి సౌకర్యం, పిల్లల ఫీడింగ్ రూమ్, టాయిలెట్లు, లగేజీ భద్రపరుచుకునేందుకు గదులు, అడ్వాన్స్‌‌డ్ ఫ్లోరింగ్, ఫ్యాన్ల ఏర్పాటుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని సంకల్పించారు. పనులు నత్తనడకన సాగుతూ ఇప్పటివరకు 90 శాతం పూర్తయ్యాయి.

పెండింగ్ పనులపై సందిగ్ధత..
భవన నిర్మాణం దాదాపు తుది దశకు చేరినప్పటికీ కోటి రూపాయల విలువైన మిగులు పనుల విషయంలో అధికారుల మధ్య స్పష్టత కొరవడింది. భవనంలో భక్తులు క్యూలో నిలబడటం కోసం స్టీల్ రాడ్స్ అమర్చడం, రెండు ప్రత్యేక లిఫ్ట్‌‌లు బిగించడం, భవనం బయట భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి పనులు ఇంకా పెండింగ్‌‌లోనే ఉన్నాయి. 

ఈ పనుల నిర్వహణను ప్రస్తుతం పనులు చేసిన కాంట్రాక్టర్లకే అప్పగించాలా లేక కొత్తగా టెండర్లు పిలవాలా అనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నిర్ణయరాహిత్యం కారణంగా విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏకంగా పూర్తయిన క్యూ కాంప్లెక్స్ భవనానికి తాళం వేయడంతో, పనులన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి.

ఎండ, వానలో భక్తుల అవస్థలు
అధికారుల నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా మల్లన్న భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో భక్తులు 3 నుంచి 5 గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వస్తున్నా, ఈ కొత్త క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి రాకపోవడం శాపంగా మారింది. 

దీంతో భక్తులు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిళ్ల కిందే ఎండను, వానను లెక్కచేయకుండా గంటల తరబడి వేచి చూస్తూ మల్లన్న దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు  స్పందించి పెండింగ్ పనులపై తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకుని క్యూ కాంప్లెక్స్‌‌ను అందుబాటులోకి తేవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నెల రోజుల్లో ప్రారంభిస్తాం
భక్తుల కోసం నిర్మిస్తున్న నూతన క్యూ కాంప్లెక్స్ భవనాన్ని వచ్చే నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. కోటి రూపాయలతో మిగులు పనులు నిర్వహించే విషయంపై ఏర్పడిన ఇబ్బందిని  దేవాదాయ శాఖ కమిషనర్  దృష్టికి తీసుకెళ్లాం. ఆయా పనులను సైతం ప్రస్తుత కాంట్రాక్టర్ కు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని రోజుల్లోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం వుంది.

శంకర్, ఏఈ , మల్లన్న ఆలయం