- పార్టీ లైన్ దాటడంతో వేటు వేసిన ఏఐసీసీ
- సురేఖ మంత్రి పదవిపై గవర్నర్‌కు సిఫార్సు చేసిన సీఎం
- ఆమోదం తెలిపిన శివప్రతాప్ శుక్లా.. గెజిట్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: పార్టీ లైన్ దాటిన ఇద్దరు ముఖ్యనేతలపై కాంగ్రెస్ అధినాయకత్వం కొరడా ఝుళిపించింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిపై వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించింది. ఈ క్రమంలో కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేయగా ఆయన ఆమోదం తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న జి.చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి ఢిల్లీ కేంద్రంగా నెలకొన్న ఈ సస్పెన్స్‌కు తెరపడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. డబ్బులిచ్చి మేఘారెడ్డి టికెట్ తెచ్చుకున్నారన్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఈ ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆమె వ్యక్తిగతమంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి సైతం తాను పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయలేదంటూ బదులిచ్చారు. మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణా కమిటీ ఇద్దరిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు నివేదిక పంపింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‌లతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చించారు. మరోవైపు కొండా సురేఖ కూడా ఢిల్లీకి చేరుకుని మల్లికార్జున ఖర్గే ఇతర అగ్రనేతలను కలిసి తన వాదన వినిపించారు. తాము మొదటి నుంచీ కాంగ్రెస్‌కు విధేయులమని, వెనుకబడిన తరగతుల్లో తమ కుటుంబానికి బలమైన పట్టు, భారీ ఓటు బ్యాంకు ఉందని పేర్కొన్నారు.
కానీ పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కొండా సురేఖకు స్పష్టంచేసిన ఏఐసీసీ పెద్దలు రాజీనామా చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆమె రాజీనామాకు నిరాకరించడంతోనే బర్తరఫ్ చేసినట్టు స్పష్టమవుతున్నది.
సిఫార్సు.. ఆమోదం..
ఏఐసీసీ ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గురువారం మధ్యాహ్నం గవర్నర్ కు సిఫార్సు చేశారు. రాత్రి 8 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోద ముద్ర వేయడంతో సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగుతున్న ఉత్కంఠ పరిణామాలకు తెరపడింది. మంత్రులు సహా ఎవరైనా సరే పార్టీ గీత దాటితే వేటు తప్పదనే స్పష్టమైన సందేశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పంపినట్లయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేఖపై వేటు వేస్తారా..? లేదా... అన్న చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. అంతర్గత క్రమశిక్షణ విషయంలో ఎవరినైనా ఉపేక్షించబోమనే సందేశాన్ని పంపిందని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
చుట్టుముట్టిన వివాదాలు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కొండా సురేఖను పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఫోన్ట్యాపింగ్కేసు బయటపడిన కొత్తలో మంత్రి హోదాలో సురేఖ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా సినీ హీరోయిన్లను చులకన చేసేలా మాట్లాడా రు. సినీ నటి సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారాన్ని కేటీఆర్‌కు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ కామెంట్స్ పై నటుడు నాగార్జున పరువునష్టం దావా వేయడంతో కొండాపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనం వ్యక్తం చేయడంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లోనూ ఆమె ఆధిపత్య పోరు అసమ్మతికి కారణమైంది. నియోజకవర్గాల్లో అధి కారుల బదిలీలు, పాలనా నిర్ణయాల్లో కొండా దంపతుల జోక్యం పెరిగిందంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధులే సీఎంకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.
చిచ్చుపెట్టిన సుస్మిత కామెంట్స్
మంత్రి హోదాలో కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిన సమయంలోనే ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పదవికి ఎసరు తెచ్చాయి. ఏఐసీసీకి అందజేసిన రిపోర్ట్ లో కూడా ఈ అంశాలనే క్రమశిక్షణ కమిటీ ప్రధానంగా తప్పుపట్టింది. కొండా ఫ్యామిలీ దురుసు ప్రవర్తన, వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. ఆ మేరకే కొండాను మంత్రివర్గం నుంచి తప్పించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని పరకాల నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈక్రమంలో సీఎం రేవంత్‌ను, ఎమ్మెల్యే రేవూరిని, ఇతర మంత్రులను కొండా సుస్మిత దూషించడం, ఓ అడుగు ముందుకేసి వ్యక్తిగత ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. సుస్మిత వ్యాఖ్యలను పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా ఖండిస్తే, కొండా తీరు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠను రోడ్డున పడేసేలా ఉందంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పీసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎంను, ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని పార్టీ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసి లిఖితపూర్వక వివరణ కోరింది. కమిటీ ఎదుట హాజరైన కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, తనకెలాంటి సంబంధం లేదని, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు వెనక్కి తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీని కోరారు. సుస్మిత వ్యాఖ్యలను ఖండించలేదు సరికదా, సమర్థించినట్లుగా ఆమె తీరు ఉందని భావించిన క్రమశిక్షణ కమిటీ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఏకగ్రీవంగా ఏఐసీసీకి నివేదించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం వేటుకే మొగ్గు చూపింది.
గీత దాటిన చిన్నారెడ్డిపై వేటు
కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్లు అమ్ముకున్నదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత చిన్నారెడ్డిపై వేటు వేయాలని ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డికి సూచించింది. దీంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం (తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు) వైస్ చైర్మన్ పదవి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకాన్ని తక్షణమే రద్దు (రెస్సిండ్) చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్నారెడ్డి కేబినెట్ హోదా కలిగిన ఈ కీలక పదవిని కోల్పోవాల్సి వచ్చింది. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహి స్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోట్లు పెట్టి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారం టూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. హైకమాండ్ టికెట్లు అమ్ముకుందనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉండడాన్ని హైకమాండ్సీరియస్గా తీసుకుంది. దీనిపై పార్టీ పెద్దలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.. చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు సిఫారసు చేసింది. ఈ నివేదికను ఏఐసీసీ పెద్దలు పరిశీలించి ఆమోదించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించారు.
హైకమాండ్ స్ట్రాంగ్ మెసేజ్
ఇద్దరు ముఖ్యనేతలపై వేటు వేయడం ద్వారా ఉల్లంఘనలను ఉపేక్షించబోమంటూ కాంగ్రెస్ అధినాయకత్వం స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖపై వేటు వేస్తారా..? లేదా..? అన్న సందేహాల మధ్య హైకమాండ్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
